
ఓ సంవత్సరం క్రితం లంగరనే పుటలో క్రమం తప్పక వ్రాస్తానని గప్పాలు కొట్టి ఇప్పటికి తీరుబడి చేసుకున్నాను. ఈ పుటలో వెనకటి తరంలోని వ్యక్తుల ప్రత్యేకతలను గురించి కొంచెం ఆలోచిద్దాం. నేను చదువుకునే రోజుల్లో Competition Success Review చదవడం పెద్ద గొప్పగా ఉండేది, Civil service పరీక్షలు వ్రాసేవారంతా వీటిని చదవడం తప్పనిసరి. నేను మా కాలేజి లైబ్రరీ లో కాని, మా కాళహస్తి లైబ్రరీలో కాని వీటిని తిరగవేసేవాడిని ( చదవడం కాదు సుమా ) అదీ టెక్కు కోసం , ఇలా తిరగవేసే సమయంలో అందులోని Group discussion గురింఛి మాత్రం తప్పక చదివేవాడిని. అందులో ఐదుమంది ఓ ఉద్యోగానికి వెళితే వారిని ఓ విషయం గురించి తర్కించమని అడిగినట్లు అందులో ఒకడు అందరిని కించపరుస్తూ, ఒకడు మాట్లాడకుండా , ఇంకోడు చివర్లో క్లుప్తంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడినట్లు, ఒకతను మాత్రం అందరిని ఓతాటిపైకి తీసుకువచ్చినట్లు ప్రతి సంచికలో మూసపోసినట్లు వ్రాసేవారు. చివరికి ఎవరు ఎలా మాట్లాడి తప్పు చేసారు అని వివరించేవారు , ప్రతి సంచికలోను ఒకే పంథాలో ఉన్నా కూడా అది చదవడం ఓ గమ్మత్తుగా ఉండేది. వీటిని చదివేప్పుడు నాకు ఓ గమ్మత్తైన ఆలోచన వచ్చేది, ఇలాంటి తర్కాలకు అందరు ఆ పుస్తకం చదివి వస్తే ఎలా ఉంటుంది అని. ప్రతి ఒక్కరు మూస పోసినట్లు ఒకే విధంగా ప్రవర్తిస్తే ఎవరిని తీసుకుంటారని. ఇదంతా ఎందుకు చెపుతున్నానని అనుకుంటూ ఉన్నారా ? అదే ఈ పుట సారాంశం.
ఇప్పటి ప్రపంచకరీకరణలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి , వాటిలో దెబ్బతిన్నది మనుషుల్లోని ప్రత్యేకమైన లక్షణాలు. మునుపటి రోజుల్లో మనసులో ఏముందో దాన్ని పైకి చెప్పేయడం, చేయాలని అనిపించినవి చేసేయడం చాల సర్వ సాధారణంగా ఉండేది. ప్రతి ఒక్కరికి ఓ ప్రత్యేకత కొట్టొచ్చినట్లు కనబడేది, ఇలాంటివి చూడాలంటే ఏ జంధ్యాల సినిమా చూసినా ఇట్లే బోధపడిపోతుంది. ఆయన చిత్రాలలో ప్రతి పాత్రకు ఓ చిత్రమైన అలవాటు కానీ లేక ఓ ప్రత్యేక లక్షణం కాని తప్పక ఉంటుంది. ఆనంద భైరవి లో శ్రీలక్ష్మి ఈల వేయడం, చూపులు కలిసిని శుభవేళ లో సుత్తి వీర భద్రరావు నడక, బ్రహ్మానందం తిండిపోతు పాత్ర , శ్రీవారికి ప్రేమలేఖ లోని ప్రతి ఒక పాత్ర ఇలా చెప్పుకుపోతే కోకొల్లలు. ఇవన్ని ఏ కల్పితాలో అని నేను అనుకోను ఎందుకంటే అప్పటి తరంలో ఇది సర్వసాధారణం. ఓ పెళ్ళిలో కూర్చొని ఓసారి చూట్టు చూస్తే ఇలాంటి పాత్రలు తప్పకుండా కంటపడేవి. అవి కొందరికి కోపం మరి కొందరికి ఆనందం కలిగించేవి, ఇలా ప్రత్యేక లక్షణాలు వారి పేరులో జతపడిపోయేవి .
ఎవరన్న్నా వారి గురించి మాట్లాడితే వెంటనే వారి ప్రత్యేకత ఇట్టే గుర్తుకుతెస్తాయి. వీటన్నిటికి కారణం మంది ఎక్కువకావడం ( జనాభా కాదు ), మన అనే వాళ్ళు ఎక్కువ, మనం ఎలా ఉన్నా కూడా మనల్ని దగ్గరకు చేర్చుకోవడం, మనసువిప్పి చెప్పుకోవడం ఎక్కువ.
ఇలా నాకు నా చిన్నతనంలో గుర్తుకుతెచ్చే కొందరిని మీముందు ఉంచుతున్నాను
మా ఊరి కూరగాయల సంతలోని రంగమ్మ , చుట్ట నములుతూ ఆడ మగ అనే తేడా లేకుండా అమ్మనా బూతులు మాట్లాడే ఈమెను చూస్తే చాలు జడుసుకొనేయడం మా వంతు. సినిమాలలోని సూర్యకాంతం పాత్రలు కూడా ఈమె ముందు దిగదిడుపే.
నా ఉన్నత పాఠశాల ( high school) ఉపాధ్యాయులు , తక్కిళి మాస్టారు ( craft teacher). తెల్ల పంచ , మోచేతి వరకు మడిచిన తెల్ల చొక్కా , మోముపై కించిత్తైనా నవ్వు కనబడని ఈయనను చూస్తే చాలు మాకు భయం. తరగతికి వచ్చినవెంటనే తక్కిళి ( నూలు వడికేది ) తీసుకురాని వారిని పిలిచి వేళ్ళపై చెక్క డస్టర్తో కొట్టి, తన జేబులోని తెల్ల కాగితంపై డబ్బు లెక్కలు వ్రాసుకుంటూ మిగతా సమయాన్ని గడిపేయడం ఈయన ఆనవాయితి. నవ్వులేని మోము, పిల్లలను కొట్టే ఆ క్రూరత్వం ఇప్పటికీ గుర్తుకు ఉండిపోయింది.
మా నాన్నగారి చిన్నాన్న ( నాకు తాతయ్య) సింగరాజు సుబ్రహ్మణ్యం , ఈయనకు ఆనే కాళ్ళు ( corns ), ఓ కంట్లో శుక్లం వచ్చి తెల్లగా ఉండేది. ఈయనను మేమంతా శుక్రాచార్య అని పిలిచేవాళ్ళం , సమకాలీకులైతే గుడ్డి సుబ్రహ్మణ్యం అని పిలిచేవారు. ఇదే ఇప్పటి సమయంలో ఇలా పిలవడం ( political correctedness ) అసంభవం. తమ శరీరలోపాన్ని తమ పేరులో చేర్చుకోవడం చాల సాధారణంగా ఉండేది. అందరితో కలిసిపోతూ కలివిడిగా ఉండడం ఈయన ప్రత్యేకత.
ఇక మా నాన్నగారి మేనత్త అల్లుడు ఉడాలి నరసింహ మూర్తి, ఈయన పేరంటేనే గుర్తుకు వచ్చేది ఈయనగారి రుచి పక్వం. ఏ పెళ్లి అయినా, చావు దినాలు అయినా కూడా వంట గదికి వెళ్లి వాళ్ళు చేస్తున్న పిండి వంటలు ముందుగా వెళ్లి రుచి చూసి అది చేసిన వంటవాడి గురించి, మిగతా చోట్లలో చేసిన పిండి వంటలతో పోల్చడం మరియు చర్చిడం ఇప్పటికీ టక్కున గుర్తుకు వస్తుంది.
సోషలిస్టు జమానాలో కేపిటలిస్ట్ వ్యవస్థకు తగ్గట్టు బట్టలు, మెడ తిప్పి వెనక్కు చూడాలని అనిపించే అందం, దాన్ని అలా ఉంచుకొనే విధానం , ఇవన్ని నాకు చిన్నతనంలోనే ఒక ప్రేరణ కల్పించిన మా విశ్వం బాబాయి , వరసకు బావ అయ్యే కావలి కుమార్ ( ఉడాలి నరసింహం గారి కుమారుడు ).
మా పొరుగున ఉండే మొదలియార్ , పొద్దున్న లేచింది మొదలు రాత్రి వరకు ఎవరితోనో తగవు పెట్టుకోకుండా ఉండలేడు. ఇంటి బయటకు వచ్చి నాలుగు వీధులు వినబడేట్లు బూతు పురాణం ఎత్తుకోవడం ఈయనగారి ప్రత్యేకత.
మనుషుల స్వభావము వారికి దగ్గరిలోని బంధువులకో , మిత్రులకో సుపరిచయంగా ఉండేది.
ఇప్పుడు ఎవరి గూట్లో వారు తాము అక్కడ ఉన్నాము అనే ఆనవాళ్ళు కూడా లేకుండా జీవించేయడం , ఎవరన్నా వారి పరిధిలోకి వస్తే వెంటనే " respect my privacy " అని అనడం ప్రత్యేకత . జీవితంలో సగభాగం కార్యాలయాల్లో తెచ్చుకు వచ్చిన వ్యక్తిత్వంతో తిరుగాడే యాంత్రిక పాత్రలతో గడిపేస్తూ ఉన్నాము. ఇప్పటి కార్యాలయాల్లో ఎలా మాట్లాడాలి , చివరకు పళ్ళు కనబడకుండా తెచ్చిపెట్టుకొని నవ్వడం ఎలాగో కూడా నేర్పిస్తూ ఉన్నారు.
ఎవరిది ఎటువంటి స్వభావామో తెలియదు, పక్కనే నవ్వుతూ తిరుగాడే వాడు రేపు ఏమై కనబడతాడో ఎవరికీ తెలియదు.
ఎవరు ఏమి మాట్లాడాలన్నా ఎదుటివాడు ఏమి అనుకుంటాడా అని ముందే వడిగట్టుకొని మాట్లాడటం తప్పనిసరి.
మనసు విప్పి మాట్లాడం చాల కష్టం , వెనుకటికి ఎవరో చెప్పినట్లు " నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి " అని జీవించడం ఉత్తమంగా తయారయ్యింది.